హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా తయారు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఫేస్ మాదిరి విగ్రహాన్ని తీర్చిదిద్దారని, అందుకే తాము నమూనాను మారుస్తున్నామని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆత్మను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉంటదని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నయ్. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? ఫామ్‌హౌస్‌లో పడుకొని కేటీఆర్ ను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నడు. కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నడు. పదేండ్లు మంచి పాలన అందిస్తే.. బీఆర్ఎస్ను జనాలు ఎందుకు ఓడగొట్టిన్రు? మా నాయకుడు రేవంత్ రెడ్డి.. సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిండు. ఆయన మీద ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నరు. రేవంత్ సీఎం అయ్యాకనే రాష్ట్రంలో చాలా మార్పులు జరిగినయ్’’అని అన్నారు.