- నాలా మరొకరు బాధ పడొద్దని అదే రోజు ట్వీట్ చేశా
- కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు
- ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి.. క్షమాపణ చెప్పాల్సిందే
- కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్‌గా ముందుకెళ్తానని వెల్లడి
వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను చులకనగా చూడడం.. తనను రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే భావోద్వేగానికి లోనయ్యానని, ఆ క్రమంలో ఓ కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని ఆమె పేర్కొన్నారు. గురువారం వరంగల్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు.
‘‘కేటీఆర్ క్యారెక్టర్ గురించి.. మహిళల మీద ఆయనకున్న చులకభావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చింది” అని ఆమె అన్నారు.‘‘కానీ, నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. ఆ సందర్భంలో ఓ కుటుంబం గురించి కొన్ని వ్యాఖ్యలు అనుకోకుండా నా నోటి నుంచి వచ్చాయి. వారి ట్వీట్ చూశాక నేను కూడా బాధ పడ్డాను. ఏ విషయంలో నేను బాధ పడ్తున్నానో అలాంటి అంశంలోనే మరొకరిని నొప్పించానని భావించి అదేరోజు రాత్రి ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశా. నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడొద్దనే ఆలోచనతోనే బేషరతుగా నా మాటలను వెనక్కు తీసుకుంటున్నా” అని సురేఖ చెప్పారు.
తగ్గేదే లేదు.. కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే..
తన విషయంలో కేటీఆర్ చేయాల్సిందంతా చేసి.. మళ్లీ తననే క్షమాపణలు అడగడంచూస్తే.. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని మంత్రి సురేఖ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో తగ్గేదిలేదని హెచ్చరించారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పి.. సోషల్ మీడియాలో ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు.
‘‘తనపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టినోళ్లను దుబాయ్‌లో దాచిపెట్టి.. తనకు ఆ అకౌంట్‌కు సంబంధం లేదనడం ఏంటి..? ఇంకా నన్ను క్షమాపణలు అడగడం, నాపైనే లీగల్ నోటీసులు పంపడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వాటిని లీగల్‌గానే ఎదుర్కొంటా”అని సురేఖ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు తనకంటే ముందు మంత్రి సీతక్కపై ఇంకా ఘోరంగా తప్పుడు వార్తలు ట్రోల్ చేయించినట్టు చెప్పారు. ‘‘బస్సులో తిరిగే ఆడ బిడ్డలను అవమానిస్తడు.. ముగ్గురు బిడ్డలను కంటే అవమానిస్తడు.. అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లవ్ ఫెయిల్ అంటండు.. కేటీఆర్‌కు మహిళలు పనికిరానివాళ్లుగా కనిపిస్తున్నారా..? మీ చెల్లె, మీ కుటుంబమే మహిళలా..? ఇలాంటి అంశాల్లో ఇతరులు మాట్లాడితే వారి నోళ్లు ఫినాయిల్ పెట్టి కడగాలని అంటుండు. మరీ ఆయన మాట్లాడిన మాటలను యాసిడ్ పెట్టి కడగాలా?” అంటూ సురేఖ నిలదీశారు.