కొమురవెల్లిని అభివృద్ధి చేస్తాం : మంత్రి కొండా సురేఖ 

కొమురవెల్లిని అభివృద్ధి చేస్తాం : మంత్రి కొండా సురేఖ 

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను కుటుంబ సమేతంగా దర్శించుకుని, తన మనుమడి పుట్టు వెంట్రుకలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మల్లన్న జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం దాతల సహకారంతో ధర్మశాలను నిర్మిస్తామని చెప్పారు.

మల్లన్న కల్యాణం వరకు 50 గదుల ధర్మశాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయిస్తామన్నారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌‌ ఆధ్వర్యంలో మంత్రికి పూర్మకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగం, కాంగ్రెస్ నాయకులు కొమ్ము నర్సింగరావు, సానాది భాస్కర్, గుండా మహేశ్‌‌, ఉప్పల వంశీకృష్ణ, ఏర్పుల రాజు, గోదాల నవీన్‌‌ ఉన్నారు.