సబ్బితం గ్రామంలో రూ.50 లక్షలతో సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

సబ్బితం గ్రామంలో రూ.50 లక్షలతో సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని  రూ. 50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి మంగళవారం సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు సబ్బితం గ్రామంలోని సీతారామాంజనేయ ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసుకొని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్​ శ్రీహర్ష, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

తల్లీబిడ్డకు బట్టలు, చెప్పులు కొనిచ్చిన మంత్రి

సుల్తానాబాద్, వెలుగు: ఒడిశాకు చెందిన ఓ వలస కుటుంబం సుల్తానాబాద్‌ పట్టణంలో రోడ్డు వెంట నడిచి వెళ్తుండగా అదే టైంలో మంత్రి కొండా సురేఖ కాన్వాయ్ వెళ్తోంది. తన కాన్వాయ్‌ను ఆపిన మంత్రి.. వలస కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబంలో తల్లీబిడ్డకు కాళ్లకు చెప్పులు, ఒంటిపై సరైన బట్టలు లేవని గమనించిన మంత్రి.. పక్కనే ఉన్న ఓ ఫుట్‌వేర్‌‌ షాపులోకి వెళ్లి చెప్పులు, ఆ పక్కనే షాపులో బట్టలు కొన్నారు. 

దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి తల్లీబిడ్డలకు అందజేశారు. కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్, కౌన్సిలర్ నిషాద్ రఫీక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమీనుద్దీన్ అక్కడికి చేరుకొని మంత్రిని సత్కరించారు. 

సేవకులుగా పనిచేస్తున్నాం

సుల్తానాబాద్, వెలుగు: పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఉద్దేశమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలు భాగంగా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో మంగళవారం రూ.4.05 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, లీడర్లు వెంకటేశ్వర్ రావు, సంతోష్ రావు, తిరుపతి పాల్గొన్నారు. సుద్దాల గ్రామంలో ఉపాధి హామీ పనులను లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు ప్రారంభించారు.