వేములవాడ ఆలయానికి బంగారు తాపడం

వేములవాడ ఆలయానికి బంగారు తాపడం

 

  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడి
  • యాదాద్రి తరహాలో రాజన్న గుడిని అభివృద్ధి చేస్తం
  • వెండి నిల్వలతో పల్లకీ, ఉత్సవమూర్తుల విగ్రహాలు
  • త్వరలో రాజన్న ఆలయంపై సీఎం సమీక్షిస్తారని వెల్లడి

వేములవాడ, వెలుగు: రాజన్న ఆలయానికి బంగారు తాపడం చేయిస్తామని, వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. రాజరాజేశ్వరస్వామి ఆలయంలో 65 కిలోల బంగారం, ఐదు కిలోల వెండి నిల్వ ఉందని, ఉన్న బంగారంలో ఆలయానికి తాపడం చేయించడంతోపాటు వెండితో పల్లకీ, ఉత్సవ విగ్రహాలను తయారు చేయిస్తామన్నారు. సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

రాజన్న సన్నిధిలో తన మనువడి పుట్టు వెంట్రుకల మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆలయ మార్పులు, అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. భక్తులకు సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు.​ రాజన్న భక్తులకు సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  కృషిచేస్తున్నారన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని 63 కిలోల బంగారంతో తాపడం చేయించడానికి ఇప్పటికే జీవో ఇచ్చినట్టు చెప్పారు. మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వాగతం పలికారు.