రెండో రాజధానిగా వరంగల్​ను డెవలప్‍ చేయమంటం : కొండా సురేఖ

  • కొత్త మాస్టర్ ప్లాన్‍..అండర్‍ డ్రైనేజీ, ఎయిర్‍పోర్ట్​పై దృష్టి
  • సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ను 12 అంతస్తులతో ప్రారంభిస్తాం
  • మంత్రి సీతక్క, మేయర్‍, ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్​ 

వరంగల్‍, వెలుగు: వరంగల్​ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి జిల్లా తరఫున సీఎం రేవంత్‍రెడ్డిని కోరతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్క, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, గ్రేటర్‍ కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే తదితరులతో హనుమకొండ కలెక్టరేట్​లో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలు, గ్రేటర్‍ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులు, పెండింగ్‍ ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చించారు. 

తర్వాత నిర్వహించిన ప్రెస్‍మీట్​లో కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం దృష్టికి తీసుకెళ్లే అంశాల్లో మొదటి ప్రయారిటీ కొత్త మాస్టర్‍ప్లాన్‍ అని చెప్పారు.  గత ప్రభుత్వంలో బీఆర్‍ఎస్‍ లీడర్లు తమ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం మాస్టర్​ప్లాన్​ను ఇష్టారీతిన రూపొందించారన్నారు.  అందుకే అందులో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు చెప్పారు. దీనికి తోడు అండర్‍గ్రౌండ్​ డ్రైనేజీ, మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​, ఔటర్‍, ఇన్నర్‍ రింగురోడ్లు, ఇండస్ట్రీయల్‍ కారిడార్​ స్మార్ట్​సిటీ ప్రాజెక్టులను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ లేదంటే బడ్జెట్‍లో ఎక్కువ నిధులు కేటాయించాలని అడుగుతామన్నారు. గత ప్రభుత్వం వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ ఆవరణలో అవసరానికి మించి 24 అంతస్తుల హాస్పిటల్‍ నిర్మాణం ప్రారంభించిందని,  వైద్య సేవలకు 12 అంతస్తులు సరిపోతాయని, వీలైనంత త్వరగా దాన్ని ఓపెన్‍ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. 

మామునూర్‍ ఎయిర్​పోర్ట్​ పునరుద్ధరణ విషయంలో రైతులు రెడీగా ఉన్నారని.. జీఎంఆర్‍ సంస్థ కూడా పాజిటివ్​గా ఉన్నందున దానిపైనా చర్చిస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రం, ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు ఆర్థిక సాయం, వరంగల్‍ బస్టాండ్‍కు నిధులు, కార్పొరేషన్‍ బిల్డింగ్‍ నిర్మాణం, వెటర్నరీ యూనివర్సిటీ, ఆయుర్వేదిక్‍ హాస్పిటల్‍, స్టేడియం నిర్మాణం,  దేవునూర్‍ గుట్టలపై టూరిజం, ఫోర్ట్ ​వరంగల్‍ సుందరీకరణ, ఎంజీఎంలో సమస్యలను సీఎంతో చర్చించి కావాల్సిన ప్రపోజల్స్​ అందించనున్నట్లు వివరించారు.