హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసు విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం విచారణ జరిపింది.
అయితే, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున కొండా సురేఖ కోర్టుకు హాజరుకాలేదని ఆమె తరఫు లాయర్ కోర్టుకు వివరణ ఇచ్చాడు. మరింత గడువు ఇవ్వాలని కోరాడు. దీంతో విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి వచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని కొండా సురేఖ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్‌పై నాగార్జున పరువునష్టం దావా పిటిషన్ ఫైల్ చేశారు.