గురుకులాలపై కేటీఆర్ కుట్రలు..ఫుడ్ పాయిజన్​పై ఆర్ఎస్ ప్రవీణ్‌తో దుష్ప్రచారం: కొండా సురేఖ

గురుకులాలపై కేటీఆర్ కుట్రలు..ఫుడ్ పాయిజన్​పై ఆర్ఎస్ ప్రవీణ్‌తో దుష్ప్రచారం: కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​తో గురుకులాలపై సైకోరావు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.  రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంటూ జరుగుతున్న దుష్ప్రచారంలో ఆర్ఎస్పీ పాత్ర ఉందని ఆమె అన్నారు. ఫుడ్ పాయిజన్​ఘటనల వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని.. దీనిపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.

శుక్రవారం  సెక్రటేరియెట్​లో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసిన కేటీఆర్ జైలుకు పోతా.. పోతా అని కలువరిస్తున్నారు.. ఆయనకు నిద్రలో కూడా జైలే గుర్తుకొస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన చెల్లెకి టైమ్ వచ్చినప్పుడు ఆమె అరెస్ట్ అయిందని.. అట్లనే కేటీఆర్, కేసీఆర్ కూడా సమయమొచ్చినప్పుడు అరెస్టు అవుతారన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కవిత, హరీశ్ ఏకమై.. కేటీఆర్​ను పక్కనబెడుతున్నారని, కేటీఆర్​తో పార్టీకి నష్టం జరుగుతున్నదనే భావనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. వాంకిడి ఘటనలో చనిపోయిన విద్యార్థి శైలజ మరణం బాధాకరమన్నారు. 

గురుకులాల్లో ఆర్ఎస్పీ అనుచరుల కుట్రలు

కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో ఐదేండ్లు రేవంతన్న పాలనే ఉంటుందని సురేఖ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదీస్తే మరో పదేండ్లు కాంగ్రెస్ పాలనే ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకపోవడంతో  కేటీఆర్ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు.

గురుకులాల బాధ్యతలు చూసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూ.కోట్లు దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. ఆర్ఎస్పీ తన అనుచరగణంతో లక్షలు వసూలు చేసి గురుకులాల్లో నియామకాలు, టెండర్లు చేపట్టారు. వారంతా ఇప్పుడు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.