ఖిలావరంగల్ (మామునూరు)/ ఖిలావరంగల్ (కరీమాబాద్)/ జనగామ అర్బన్, వెలుగు: వాహనదారులు విధిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా శుక్రవారం బల్దియా పరిధి 41వ డివిజన్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మంత్రి మేయర్ గుండుసుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పోశాల పద్మతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.
అంతకుముందు బేటీ బచావో–బేటీ పడావో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మీ, డీడబ్ల్యూవో రాజమణి, డీఈవో జ్ఞానేశ్వర్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎంవీఐ జయపాల్ రెడ్డి, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల నెహ్రూ యువకేంద్ర వారి ఆధ్వర్యంలో తాళ్ల పద్మావతి ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. నెహ్రూ యువకేంద్ర అధికారి బానోతు దేవిలాల్, కాలేజ్ డైరెక్టర్ వరుణ్, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్ రావు, అధ్యాపకులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారి జీవీ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.