వరంగల్సిటీ, వెలుగు : సమాజంలో మహిళల సేవలు, మహిళా ఉద్యోగుల కృషి వెలకట్టలేనివని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె వరంగల్ ఎంజీఎంను సందర్శించారు. అక్కడి సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రినీ ప్రక్షాళన చేయడంతోపాటు, అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలసి మంత్రి నూతనంగా నియమకమైన నర్సులకు నేమ్ బ్యాడ్జీలను ధరింపజేశారు. ఎం జీ ఎం ఆసుపత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగులు రోగులకు అందించే సేవలు మరువలేనివని ప్రభుత్వం వారి సేవలను తప్పక గుర్తిస్తుందని అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో రోగులకు సేవలందిస్తూ వృత్తికి గౌరవాన్ని తెస్తున్న నర్సుల కృషి ప్రశంసనీయమని అన్నారు.
పాలకుర్తి : నేటి సమాజంలో మహిళలు ఆత్మ గౌరవంతో జీవించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మానం చేసారు.
కాశీబుగ్గ : మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ మగవారికి దీటుగా పోటీపడుతున్నారని వరంగల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)డివిజన్ మేనేజర్ పర్కార్ వర్మ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్సీఐలోని ఉమ్మెన్స్ వింగ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సీఐ ఆఫీసర్లు సుస్మిత్ చక్రవర్తి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్, జగ్గు నాయక్, రామచంద్ర, దీపల నాయక్, మమత, మహిళా ఆఫీసర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎన్ఐటీ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిట్ మహిళా సెల్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా వచ్చారు. మహిళా సాధికారత అనే అంశంపై నిర్వహించిన ఓపెన్ మైక్ సెషన్ లో మహిళలు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు శైలజా కుమారి, రాణి, మాధవీ, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది, స్టూడెంట్ వెల్ఫెర్ డీన్ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు.