
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నడిపించండి
- ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి కొండా సురేఖ సమీక్ష
సంగారెడ్డి, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన పేదలకు అభయ హస్తం మాదిరి ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి కొండా సురేఖ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంపై మూడు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమం పారదర్శకంగా జరగాలన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా పాలకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీముల గురించి ప్రజలకు వివరిస్తూ అసలైన అర్హులను గుర్తించి పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రజాపాలన అమలు తీరుపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమీక్షించి కిందిస్థాయిలో పథకాలు సరిగ్గా అందేలా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు వాటికి సంబంధించిన వినతి పత్రాలు, దరఖాస్తులను స్వీకరించాలన్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. అభివృద్ధి చెందడం అంటే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాదిరిగా అద్దాల మేడలు, రంగు రంగుల గోడలు కట్టడం కాదని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం అన్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన పలు సందేహాలకు మంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.
అనంతరం ప్రజాపాలన పోస్టర్, దరఖాస్తును, సీఎం రేవంత్ రెడ్డి సందేశ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఉమ్మడి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, సంగారెడ్డి ఎస్పీ, మెదక్, సిద్దిపేట ఇన్‌చార్జి ఎస్పీలు తమ తమ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. సమీక్షలో సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్, అడిషనల్ ఎస్పీలు, జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.