వరంగల్: బీసీల సంఖ్య పెద్దదే కానీ ఐక్యత లేక అన్నీ కోల్పోతున్నామని.. దశాబ్ధాలుగా బీసీలు నష్టపోతున్నారని మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఏకం చేసేందుకు.. బీసీ కులాల సమైక్య వేదిక ఏర్పాటు అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబర్ 24) ఖిలా వరంగల్ కోటలో గౌడ అఫిషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రొగ్రాంకు మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కులగణన వల్లే బీసీల అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. బీసీలకు దక్కాల్సిన వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కుల గణన చేపడుతోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.44వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధి మేం పది నెలల్లో చేశామని.. అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.