వరంగల్ జిల్లా ఐలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి సురేఖను పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఐలోని మలన్న జాతరపై, భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శాఖల వారిగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. "ఐలోని జాతరలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అధికారుల పనితీరులో మార్పు రావాలి. జాతర ప్రాంగణంలో చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రతగా ఉండేలా చూడాలి. జాతరకు వచ్చే భక్తులు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. జాతరలో వృద్ధులకు, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. జాతర లో భక్తులు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. అత్యవసర సేవలు అందిందేందుకు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలి. హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి.. కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. గతంలో జాతర కంటే... మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి" అని ఆదేశించారు.