- మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- వీవీప్యాట్లను లెక్కించకపోవడంపై గతంలో హైకోర్టుకెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి
- ఆ పిటిషన్‌ను తిరస్కరించాలన్న కొప్పుల అప్పీల్‌కు హైకోర్టు నో
- తాజాగా అదే విషయంపై సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, వెలుగు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీవీప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పిటిషన్లో లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. మంత్రి తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులలో లోపాలున్నాయని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఆ వాదనలను బెంచ్ ఏకీభవించకపోవడంతో పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని లాయర్లు కోర్టుకు తెలిపారు. అందుకు అనుమతించిన కోర్టు పిటిషన్ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.