మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మూడేళ్ల పాటు విచారణ జరిగి అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టు వెల్లడించింది. ఎన్నికపై దాఖలైన పిటీషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
2018లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ టికెట్ తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ అక్రమ పద్ధతులతో గెలిచారని అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని ...తననే ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. మంత్రి పిటిషన్ ను హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది.