- యావర్ రోడ్డు విస్తరణ పై విభేదాలు ..!
- ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే అనుచరులు డుమ్మా
- బీఆర్ఎస్ పార్టీ నేతల్లో బయటపడ్డ విభేదాలు
జగిత్యాల, వెలుగు: యావర్ రోడ్డు విస్తరణ అంశం పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడగడం, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆయనపై కోప్పడటంతో బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్ లో టవర్ సర్కిల్, తహశీల్ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి, మున్సిపాలిటీ, ఎమ్మార్వో ఆఫీసులు, కోర్టు, ఆర్డీవో ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ ఆఫీస్, ఆర్అండ్ బీ ఆఫీస్, ఫైర్ స్టేషన్, మున్సిపల్ పార్క్, అంగడి బజార్ లా విస్తరణ కీలకంగా మారింది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ జిల్లా స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై మంత్రి విభేదించడంతో పట్టణ వాసులు పనులు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల బీఆర్ఎస్ నేతల గుర్రు
జిల్లా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మినిస్టర్ కొప్పుల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు, బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం లో నిరసన తెలిపేందుకు స్టేజీ వద్దకు వచ్చిన అనుచరులు, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే దండం పెట్టి ఆపారు. అనంతరం సమావేశం నుంచి కార్యకర్తలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 న రాయికల్ పట్టణం లోని శివాజీ గార్డెన్ లో బీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనానికి మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఎమ్మెల్యే సంజయ్ అనుచరవర్గం, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, లీడర్లు హజరు కాకపోవడం బీఆర్ఎస్ లో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని సభా దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే సంజయ్ ను అవమానించే విధంగా మినిస్టర్ మాట్లాడటం ఏంటని జగిత్యాల బీఆర్ఎస్ క్యాడర్, ఎమ్మెల్యే అనుచరులు గుర్రుమంటున్నారు. మరో వైపు పార్టీ సమావేశంలో పార్టీ సంబంధిత అంశాలు మాట్లాడకుండా నిధులపై మాట్లాడటం తో కొప్పుల అలాంటి వ్యాఖ్యలు చేశారని కొప్పుల అనుచరులు ప్రతి విమర్శలు చేస్తున్నారు.
బయటపడ్డ విభేదాలు
జగిత్యాల జిల్లా కేంద్రం లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మార్చి 18 జరిగిన బీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జితేందర్ రావు యావర్ రోడ్డు వెడల్పు చేయాలనే అంశం తెర పైకి తీసుకువచ్చారు. అక్కడే ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రూ.100 కోట్ల నిధులు మంజూరైతే ఇండ్లు కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇచ్చి వెడల్పు చేయవచ్చని సభాముఖంగా కోరాడు.
నాలుగున్నర ఏళ్లు చేసిన అభివృద్ధి ప్రజలకు చూపాలని, నిధులు రావని వచ్చినా మూడు నెలల్లో ఏం చేయలేమని మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు అసహనం వ్యక్తం చేసి స్టేజీ వద్దకు నిరసన తెలిపేందుకు వచ్చారు. సమావేశంలో ఎలాంటి నిరసనలు తెలపవద్దని తన అనుచరులను ఎమ్మెల్యే సంజయ్ కోరడంతో శాంతించారు.