ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పోటీగా బీజేపీ సభ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారంతా హైదరాబాద్ మీద దండయాత్ర చేసేందుకే వస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పోషించిన పాత్ర ఏమిటో చెప్పాలని నిలదీశారు.
దేశంలో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెలంగాణకు 10సార్లు వచ్చిన అమిత్ షా.. రాష్ట్రానికి ఒక్క రూపాయైనా తెచ్చారా అని నిలదీశారు. వేములవాడ రాజన్న ఆలయానికి కరీంనగర్ ఎంపీ ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు.
హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా.. లేక తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నామని కేటీఆర్ అన్నారు. ప్రజలు మోయలేని విధంగా కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచేసిందని, కోవిడ్ తర్వాత దేశం మరింత పేదరికంలోకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమానికి తెలంగాణ ట్రేడ్ మార్క్ గా నిలిచిందన్న కేటీఆర్.. రాష్ట్రంలో కరెంట్, నీటి సమస్య లేకుండా చేశామని స్పష్టం చేశారు.