సిరిసిల్ల మరో షోలాపూర్ కావాలి.. కేటీఆర్‌‌‌‌ను భారీ మెజారిటీతో గెలిపించండి : కేసీఆర్

  • కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలనూ రాజకీయం చేస్తున్నరు
  • ఓట్ల కోసం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పం
  • సాధ్యమైన హామీలతోనే మేనిఫెస్టో తయారు చేసినం
  • సిద్దిపేట వజ్రపు తునకలా తయారైంది
  • మరోసారి లక్ష పైచిలుకు మెజార్టీతో హరీశ్‌‌ను గెలిపించండి
  • సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో ప్రసంగం

రాజన్న సిరిసిల్ల/ సిద్దిపేట, వెలుగు : ఒకప్పుడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల రూపురేఖలు మంత్రి కేటీఆర్​వల్ల మారిపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేటీఆర్ చొరవతో నేతన్నల ఆత్మహత్యలు ఆగాయని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లను షోలాపూర్, సూరత్‌‌లా తయారు చేస్తాం. సిరిసిల్ల మరో షోలాపూర్​గా మారాలంటే కేటీఆర్‌‌‌‌ను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని కోరారు. మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం హాజరై మాట్లాడారు. 

సిరిసిల్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ ప్రాంతంలో చిన్నప్పుడు సైకిల్‌పై  కలియ తిరిగానని, నియోజకవర్గంలో ప్రతి గ్రామం తనకు తెలుసని చెప్పారు. ‘‘కేటీఆర్ నాతో కొట్లాడి మరీ మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నేత కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరలను ఇక్కడ తయారు చేయిస్తున్నాం. కానీ కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలను కూడా రాజకీయం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపినందుకు కేటీఆర్ ను అభినందిస్తున్న’’ అని చెప్పారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి

తొమ్మిదిన్నర ఏండ్లలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో మనదే మొదటి స్థానమన్నారు. దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. ‘‘మేం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తుంటే..మూడు గంటలు చాలని కాంగ్రెస్​ ప్రెసిడెంట్ చెప్తున్నారు. 3 గంటలు కావాలో, 24 గంటలు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. బీజేపీ నాయకులు పంపుసెట్లకు మీటర్లు పెట్టమని చెప్పితే కుదరదని చెప్పాం అని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో రైతులు వీఆర్వో మొదలుకొని కలెక్టర్ల దాకా ఆఫీసర్ల చుట్టూ తిరిగేవాళ్లని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రైతులకే భూమిపై అధికారం ఇచ్చామని, వాళ్లు వేలిముద్ర వేస్తే తప్ప ఇంకొకరి పేరు మీదికి మారదని చెప్పారు. తాము ఓట్ల కోసం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పబోమని, సాధ్యమైన హామీలతోనే మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. వైట్​రేషన్​కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం ఇస్తామని, పింఛన్లను దశలవారీగా పెంచుతామని చెప్పారు.

ఆరడుగుల బుల్లెట్‌ను సిద్దిపేటకు ఇచ్చిన

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దరిద్రపు, దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ.. దళితుల అభివృద్ధి కోసం పనిచేయలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అందుకే దళితులు వెనకబడ్డారని అన్నారు. సిద్దిపేట అనుభవాలతో దళితబంధు  స్కీమ్‌కు శ్రీకారం చుట్టానన్నారు. ‘‘ఒక్క సారే అన్నీ చేయలేం. ఏడాదికి 50 వేల కుటుంబాలకో.. లక్ష కుటుంబాలకో దళితబంధు అందిస్తాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి స్కీమ్ అమలు చేసేవరకు ప్రాణం పోయినా రాజీపడను’’ అని చెప్పారు. సిద్దిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసిన సిద్దిపేట గడ్డను మరచిపోలేనన్నారు.

చింతమడకలో నేను పసికూనగా ఉన్నప్పుడు అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే.. ముదిరాజ్ మహిళ నాకు చనుబాలు ఇచ్చి సాదింది. ఈ గడ్డతో నాకు విడదీయలేని సంబంధం ఉంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆరడుగుల బుల్లెట్ లాంటి హరీశ్‌ను మీకు అప్పగించా. ఊహించిన దానికన్నా బ్రహ్మండంగా పనిచేసి హరీశ్ నా గౌరవాన్ని కాపాడారు. హరీశ్ మంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నారు. ఆయన స్థానంలో నేనున్నా ఇంత చేయగలిగే వాడినో లేదో” అని చెప్పుకొచ్చారు. సిద్దిపేటకు గాలిమోటరొక్కటే తక్కువుందని అన్నారు. సిద్దిపేట వజ్రపు తునకలా తయారైందన్నారు. గత ఎన్నికల్లో లక్ష పై చిలుకు మెజార్టీ ఇచ్చిన ఓటర్లు..మల్లొక్కసారి ఆ రికార్డు తిరగరాయాలని పిలుపునిచ్చారు.

మాది చేతల ప్రభుత్వం: కేటీఆర్

తమది చేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేశామన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్​, అగ్రికల్చర్​ పాలిటిక్నిక్ కాలేజీలను సిరిసిల్లకు  సీఎం మంజూరు చేశారన్నారు. అడగకుండానే సిరిసిల్ల జిల్లాను ఇచ్చారని, ఇప్పుడు ఎర్రటి ఎండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిచి కేసీఆర్ ను మూడోసారి సీఎం చేస్తామని చెప్పారు. 

దాబాలో చాయ్ తాగిన సీఎం

సిరిసిల్ల, సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభలను ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తూ దారిలో కేసీఆర్ కొద్ది సేపు టీ బ్రేక్ తీసుకున్నారు. గతంలో సిద్దిపేట బైపాస్‌లో ఉన్న దాబాల్లో చాయ్ తాగిన రోజులు గుర్తుకొచ్చి కాన్వాయ్‌ని వెనక్కి తిప్పించారు. పొన్నాల వద్ద సోనీ దాబాకు వెళ్లి.. నేతలతో కలిసి చాయ్​తాగారు. నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దాబాలో కేసీఆర్ చాయ్ ​తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.