మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘మునుగోడులో టీఆర్ఎస్ కు సహకరించండి. మీరు కొంచెం సహకరిస్తే.. గట్టుప్పల్ ను అభివృద్ధి చేసుకుందాం’’ అని మంత్రి కేటీఆర్ ఆయనను కోరినట్లు వీడియోలో ఉంది. ఈనేపథ్యంలో జగన్నాథంతో V6 మాట్లాడింది. కేటీఆర్ కాల్ చేసి పార్టీలోకి ఆహ్వానించింది నిజమేనని... తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని చెప్పినట్లు జగన్నాథం స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి అందడం లేదని కేటీఆర్ కు తాను చెప్పినట్లు వెల్లడించారు. కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇవ్వాలని సూచించానన్నారు. కేటీఆర్ తో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది తనకు కాల్ చేసి అభినందించారని జగన్నాథం తెలిపారు. తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్వయంగా వచ్చి తనను అభినందించారని చెప్పారు. కరోనా సమయంలో వందల మందిని రాజగోపాల్ రెడ్డి సొంత డబ్బులతో ఆదుకున్నాడని జగన్నాథం గుర్తుచేశారు.