ఆర్మూర్, వెలుగు: బీఆర్ఎస్ మెనిఫెస్టో తెలంగాణ బతుకు చిత్రం మారుస్తుందని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడే జీవన్‌రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఆర్మూర్‌లో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లే ముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, అనుక్షణం ప్రజల మధ్యే ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తారన్నారు.
కాంగ్రెస్ కర్నాటక, బీజేపీ గుజరాత్ నోట్ల మాయలో పడొద్దని, కారు ఉండగా బేకారు గాళ్లు వద్దని, పాలిచ్చే గేదెను అమ్మి కడుపులో పొడిచే దున్న పోతును కొనుక్కుందామా? అని అన్నారు. బక్కపలచని కేసీఆర్ గొంతు నులమడానికి మోదీ, అమిత్ షా,15 మంది సీఎంలు, 20 మంది కేంద్ర మంత్రులు, యోగి, భోగి, ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గుంపులుగా వస్తున్నారన్నారు.
ALSO READ: ఆత్మగౌరవం ఉన్నోళ్లు డబ్బులకు అమ్ముడు పోరు : జాజాల సురేందర్
50 ఏండ్లు కరెంటు, సాగు, తాగు నీరివ్వకుండా అరిగోస పెట్టిన కాంగ్రెస్, మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ రావడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కావాలా? కరెంట్కావాలా? ఆలోచించి ఓటేయండని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి ముందు జీవన్ రెడ్డి సిద్ధులగుట్ట శివాలయంలో పూజలు నిర్వహించి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.