మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం ప్రజలకు హామీల జల్లు కురిపిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మునుగోడు నియోజకవర్గం ఓటర్లకు పిలుపునిచ్చారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కు ఉప ఎన్నికలో అండగా ఉండాలని కోరారు.
సుమారు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధినందించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు వస్తోందని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోందని వివరించారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి.