మళ్లీ గెలిపించండి.. వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా : కేటీఆర్

  • చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్‌‌షో 

రాజన్నసిరిసిల్ల, చొప్పదండి, వెలుగు: మళ్లీ గెలిపిస్తే వారానికి 2 రోజులు సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో, చొప్పదండిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు 11 సార్లు అవకాశమిచ్చినా కరెంట్‌‌, సాగునీరు ఇవ్వకుండా ప్రజలను గోస పెట్టిందన్నారు. 

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. కరెంట్​ఎక్కడ ఉందని రేవంత్​రెడ్డి మాట్లాడుతున్నాడని, వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి కరెంట్​ తీగలు పట్టుకొని కరెంట్​లేదని నిరూపించాలని సవాల్​ విసిరారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పేరిట రూ.3వేలు అందజేస్తామన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి మండలానికో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్​ఏర్పాటు చేస్తానన్నారు.  

తాను ఎమ్యెల్యే అయ్యాక సిరిసిల్ల కోనసీమగా మారిందన్నారు.  తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌దేనన్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆగం కావద్దొని, ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు.  ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యేగా మరోసారి సుంకె రవిశంకర్​ను గెలిపించాలని కోరారు. రోడ్‌‌ షోలో లీడర్లు రవీందర్ రెడ్డి, రవీందర్, సౌజన్య, మల్లారెడ్డి, చుక్కారెడ్డి, రాజశేఖర్, విజయలక్ష్మి, శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. కాగా గంభీరావుపేటలో మంత్రి కేటీఆర్ రోడ్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు కూలి గ్యారా నర్సవ్వ, ఓ వర్కర్‌‌‌‌కు గాయాలయ్యాయి.