- ఎర్రబెల్లి దయాకర్‌రావును లక్ష మెజార్టీతో గెలిపించాలి
- డాలర్ల మాయలో పడొద్దు
- ఐటీ మంత్రి కేటీఆర్
మహబూబాబాద్, వెలుగు : మాటలు చెప్పడం వల్ల పనులు కావని, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సోమవారం నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండే దయాకర్‌రావును ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఏడుసార్లు గెలిచిన ఎర్రబెల్లిని వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రకటించిన పీఆర్ అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే దక్కడం గొప్ప విషయం అన్నారు. ఎన్నికల టైంలో కొందరు అమెరికా నుంచి డాలర్లతో వచ్చి ప్రజలను కొనేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
వారిచ్చే డాలర్లను తీసుకొని ఓట్లు మాత్రం బీఆర్‌ఎస్ కారు గుర్తుకే ఓటేయాలని చెప్పారు. మోసపోతే గోసపడక తప్పదన్నారు. దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా 2.5 శాతమే ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కన్నీళ్లు, స్కామ్‌లు, మోసం, వంచన మాత్రమే ఉండేవన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందడం లేదని కాంగ్రెస్ చెందిన ఓ ఎంపీ చెబుతున్నాడు.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి కరెంట్ వైర్లను పట్టుకుంటే నిజం ఏంటో తెలుస్తుందని
రాష్ట్రానికి పట్టిన పీడ కూడా విరగడ అవుతుందన్నారు. కళాకారులు ఏపూరి సోమన్న, మధుప్రియ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యా నాయక్, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ ఎన్.సుధాకర్‌రావు, జడ్పీ చైర్మన్ బిందు, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే ఏడాదికో సీఎం
హనుమకొండ/పరకాల, వెలుగు : బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారు.. కాంగ్రెస్ గెలిస్తే సంవత్సరానికి ఓ సీఎం మారుడు గ్యారంటీ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా పరకాల అంగడి గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. తెలంగాణను నంబర్ వన్ చేసిన బీఆర్‌ఎస్‌ను కాదని, అట్టడుగుకు నెట్టిన కాంగ్రెస్, బీజేపీ వైపు చూద్దామా ? ఢిల్లీ, గుజరాత్ గులాంలు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు.
కర్నాటక నుంచి కాంగ్రెస్, గుజరాత్ నుంచి బీజేపీ పైసలు వస్తున్నాయని, వాటిని తీసుకొని ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని సూచించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. కాగా రూ. 114.65 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యక్రమాన్ని ముగించారు.
నియోజకవర్గాన్ని ఫస్ట్ ప్లేస్‌లో నిలిపా
పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో ముందు నిలిపానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తొర్రూరులో 100 పడకలు, పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 6 వేల మంది మహిళలకు టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తూ, మెషీన్లు పంపిణీ చేస్తున్నామని, 22 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించినట్లు తెలిపారు. రైతుల పంటలు ధ్వంసం చేస్తున్న కోతులను పారదోలేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించానన్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజలంతా బీఆర్‌ఎస్‌ను ఆదరించి, తన విజయానికి సహకరించాలని కోరారు.