అత్యాధునిక స్మార్ట్ ఫ్యాక్టరీకి కేటీఆర్ భూమి పూజ

అత్యాధునిక స్మార్ట్ ఫ్యాక్టరీకి కేటీఆర్ భూమి పూజ

హైద్రాబాద్ లోని జీఎమ్మార్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్ స్మార్ట్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఐటీ సెక్రటరీ జయేష్ రంజాన్, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనిన్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద  ఫ్యాక్టరీని ష్నైడర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుందన్న మంత్రి కేటీఆర్... 75% ష్నైడర్ ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

ఏడాదిలోపే సంస్థ తమ నూతన ఫ్యాక్టరీ  ప్రారంభించనుందన్న ఆయన..  ప్రభుత్వంతో కలిసి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పై శిక్షణ ఇవ్వాలని ష్నైడర్ ని కోరుతున్నానన్నారు. ఫలితంగా ష్నైడర్ తో పాటు స్థానిక యువతకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 ఫ్రెంచ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్న కేటీఆర్.. ఇది సంతోషించే విషయమని తెలిపారు. ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ని ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారని... మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు హైదరాబాద్ లో వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరారు.