- కేసీఆర్ తరఫున జోరుగా ప్రచారం
- మండలాల వారీగా రివ్యూలు, వరుస భేటీలు
- బీజేపీ, కాంగ్రెస్ నుంచి చేరికలకు ప్లాన్
- పోలింగ్‌రోజు వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకుమంత్రి దిశానిర్దేశం
కామారెడ్డి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలో దిగిన సీఎం కేసీఆర్ ను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ చెమటోడుస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండడం, ఇక్కడ సీఎం ఓడిపోతే బీఆర్ఎస్ పరువు పోతుందనే భయంతో తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల కన్నా కామారెడ్డిపైనే కేటీఆర్ ఎక్కువఫోకస్ పెడ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లాంటి కీలక నేతలు ఉన్నప్పటికీ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్నారు.
ఇప్పటికే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించిన ఆయన.. ప్రచార, బూత్, గ్రామ, మండల కమిటీలు సమన్వయంతో పనిచేసేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసంతృప్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలోని ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ బాధిత రైతు కమిటీ ప్రతినిధులతోనూ ఇటీవల చర్చలు జరిపి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మండలాల వారీగా రివ్యూలు, ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.
అంతా కేటీఆర్మయం
తాను ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీచేస్తానని ఆగస్టు 21న సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి కామారెడ్డి వ్యవహరాలన్నింటినీ కేటీఆరే పర్యవేక్షిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలను ప్రకటించగా కామారెడ్డి బాధ్యతల్ని మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. నియోజకవర్గంలో తరుచూ పర్యటిస్తూ స్థానిక నేతల్ని సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
అక్టోబర్ 7న నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి, బూత్, గ్రామ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ నియమాకాన్ని చేపట్టారు. అసంతృప్తులతో మీటింగ్‌పెట్టి బుజ్జగించడంతో పాటు స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి చేరికలను స్పీడప్ చేశారు. అక్టోబర్ 18న మండలాలు, టౌన్‌కు చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్ పిలిపించుకొని రివ్యూ చేశారు.
గత ఎన్నికల్లో బూత్‌ల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు తెప్పించుకొని ఇన్చార్జిలకు కొత్త టార్గెట్లు ఇచ్చారు. ఎక్కువ ఓట్లు సాధించడంలో సక్సెస్ అయ్యే నేతలకు భవిష్యత్తులో పదవులు, ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంగళ, బుధవారాల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి, మండలాల వారీగా సభలు ఏర్పాటు చేశారు. మాచారెడ్డి, కామారెడ్డి, భిక్కనూ సభల్లో పాల్గొన్న కేటీఆర్..శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వివిధ వర్గాల్లో వ్యతిరేకత
అధికార పార్టీపై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా తొమ్మిది గ్రామాల రైతులు రోజుల తరబడి ఉద్యమించారు. ఈ పోరాటంతో కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చింది. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మున్సిపాల్టీలో తీర్మానం కూడా చేయించింది. ఆందోళనకారులకు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కావడంతో మరోసారి రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కొత్త మాస్టర్ ప్లాన్ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే తమ తరపున వంద మందితో నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.
దీంతో కేటీఆర్ ఈ కమిటీ ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడారు. కొత్త మాస్టర్ ప్లాన్ రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇలాంటి హామీలను రైతులు ఎంతవరకు నమ్ముతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్.. అక్కడ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. దీనినే ప్రతిపక్ష లీడర్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ ఒకవేళ రెండు చోట్ల గెలిచి కామారెడ్డి సీటును వదులుకుంటే ఉప ఎన్నికల తలనొప్పి తప్పదని చెప్తున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ అనుచరుల భూదందాలు కామారెడ్డిలో కూడా మొదలవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విమర్శలను మంత్రి కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.