కేసీఆర్ లాంటి సీఎం పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. గ్రామాల్లో వచ్చే ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ ముఖమే కనిపిస్తోందని చెప్పారు. దేశంలో ఉత్తమ అవార్డు వచ్చిన 20 గ్రామ పంచాయతీల్లో.. 19 తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని వాటికి కేంద్రమే అవార్డులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చేతనైతే.. వేములవాడకు మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. “వేములవాడ తిప్పాపూర్ లో పెద్దాస్పత్రి కట్టినప్పుడు ఎందుకు అన్నారు. ఇప్పుడు అదే ఆస్పత్రిలో మోకాలి చిప్పలు మార్చే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి” అని కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే తిప్పాపూర్ ఆసుపత్రికి అవసరమైన మరో 9 మంది వైద్యులను కేటాయించి డయాలసిస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
2014 సంవత్సరంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు. 2014 వరకు 44 సబ్ స్టేషన్లు ఉంటే.. తర్వాత రూ.51 కోట్లతో 34 కొత్త సబ్ స్టేషన్లను నిర్మించామని తెలిపారు. ప్రతి ఇంటికి నీరు ఇచ్చి.. ఆడబిడ్డల మంచినీటి కష్టం తీర్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అలాగే మూలవాగు పై రూ.62కోట్లతో 13 చెక్ డ్యామ్ లు నిర్మించామన్నారు. గతంలో 65 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. ఎనిమిదేళ్లలోనే చేసి చూపించామన్నారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే రూ.65 వేల కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో పెట్టింది తమ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.