
రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వలన ఎవరకి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కు వాతవారణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన క్రమంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టామని, 135 చెరువులకు గేట్లు బిగించామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందన్నారు.
చిల్లర విమర్శలు చేయవద్దు
ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని... భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయని వారి మనోధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్ కు అవసరమైతే రేపు తానే వెళ్తానని చెప్పుకొచ్చారు.