రాహుల్ గాంధీకి.. వడ్లకు, ఎడ్లకు తేడా తెల్వదు

జగిత్యాల, వెలుగు:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెల్వదని.. ఆయనకు పబ్బులు, క్లబ్బులే తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్​లో ఎమ్మెల్సీ ఎల్.రమణ తండ్రి ఎల్జీ రామ్ సంతాప సభకు  కేటీఆర్ హాజరయ్యారు. ఎల్. రమణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. 

ALSO READ :సీఎం ఇలాకాలో  తెగని భూ పంచాయితీ!

రైతులను కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లుగా అరిగోస పెట్టిందన్నారు. ఏనాడూ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీ మరోసారి వారిని ముంచేందుకు సిద్ధమైందని విమర్శించారు. లోకల్ లీడర్లు ఇచ్చిన నివేదికలు చదవడం మాత్రమే రాహుల్ కు తెలుసని.. ఆయన లీడర్​కాదని రీడర్​అని అన్నారు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారని, దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పేలా రానున్న 10 రోజులు రైతు వేదికల్లో తీర్మానాలు చేయాలని బీఆర్ఎస్ క్యాడర్​కు పిలుపునిచ్చారు. తన కొడుకు హిమాన్షు మాటల్లో తప్పులేదని, ప్రతి సర్కార్ బడిని కేసీఆర్ ప్రభుత్వమే బాగుచేస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ దావ వసంత, పార్టీ లీడర్​గోలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.