తమిళిసై మోదీ ఏజెంట్గా పనిచేస్తున్నరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా..?

గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ ఏజెంట్గా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సెంట్రల్ లో మోదీ అప్రజాస్వామికంగా ఉన్నారని...రాష్ట్రాల్లో  మోదీ ఏజెంట్లు కూడా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ  పదవుల్లో నామినేట్ చేయొద్దన్న గవర్నర్..మరి ఆమెను కేంద్రం గవర్నర్గా ఎందుకు నామినేట్ చేసిందని ప్రశ్నించారు. గవర్నర్ అయ్యే ముందు రోజు వరకు తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. తమిళిసైని గవర్నర్ గా నియమించడం సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్దమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అసలు దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని తెలంగాణ కేబినెట్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందన్నారు మంత్రి కేటీఆర్. దాసోజు శ్రవణ్ చదువుకున్న వ్యక్తి అని.. ఆయన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. అంతేకాకుండా ఒక ప్రొఫెసర్ గా పనిచేశారని తెలిపారు. కుర్రా సత్యనారాయణ ట్రేడ్ యూనియన్లలో పనిచేశారని..ప్రజలకు చేసిన సేవలకు ఆయన్ను సంగారెడ్డిలో గెలిపించారని గుర్తు చేశారు.  వీరు చేసిన సేవలను గుర్తించే ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని..కానీ గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం మీద కోపంతో నామినేషన్లను తిరస్కరించారని విమర్శించారు. 

Also Read :- తెలంగాణ ప్రజలకు కేసీఆరే గ్యారంటీ, వారంటీ

దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.  గవర్నర్ తీరును ఖండిస్తున్నానని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన ఇద్దరిని..బలమైన గొంతులు పనిచేస్తారని..శాసనమండలికి పంపిద్దామనుకుంటే గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ గా ఉండి తమిళిసై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకురాలిగా పనిచేస్తున్నారని ఆరోపించారు.