బల్దియా ఎన్నికల హామీని నెరవేర్చని మంత్రి కేటీఆర్

బల్దియా ఎన్నికల హామీని నెరవేర్చని మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీ పరిధిలో ఈ–లైబ్రరీల ఏర్పాటు ఇప్పట్లో జరిగేలా లేదు. కనీసం ఉన్న 82 లైబ్రరీల్లోనూ సౌకర్యాలు కల్పించడం లేదు. 2020 బల్దియా ఎన్నికల ప్రచారంలో డివిజన్ కు ఒక ఈ– లైబ్రరీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వాటి ఊసే లేదు. వరుసగా జాబ్​నోటిఫికేషన్లు రిలీజ్​చేస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులకు కావాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టడం లేదు. 20 గ్రేడ్ వన్ లైబ్రరీల టైమింగ్​పెంచాలని ఆదేశించిన మంత్రులు సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు.  టైమింగ్​పెంచితే సరిపోతుందా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2 నెలల కింద వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సిటీలోని లైబ్రరీలు ఓపెన్​గా ఉండేవి. మంత్రుల ఆదేశంతో 20 లైబ్రరీలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్​గా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే రీడర్స్​పెద్దగా రావడం లేదని నెల గడవక ముందే టైమింగ్స్​మార్చేశారు. రీడర్స్​ పెద్దగా రాకపోతుండటంతో 20 లైబ్రరీల్లో కొన్నింటి టైమింగ్ తగ్గించారు. వాస్తవానికి లైబ్రరీల్లో సరైన సౌకర్యాలు లేకనే రీడర్స్​రావడం లేదు. కనీసం ఉన్నవాటిలో కంప్యూటర్లు పెట్టి ఇంటర్​నెట్​సౌకర్యం, కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచితే నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవేం లేక యువత డబ్బు కట్టి ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే బల్దియా పరిధిలో 82 లైబ్రరీలు ఉండగా వీటిలో సిబ్బంది 50 మందికి లోపే ఉన్నారు. కొన్నిచోట్ల రెండు సెంటర్లకు ఒక ఇన్​చార్జ్​కొనసాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిరుపేద అభ్యర్థులకు తీవ్ర అన్యాయం

‘సిటీ అభివృద్ధి తన తన భాధ్యత అని, ఇచ్చిన హామీలను దగ్గరుండి అమలు చేయిస్తానని’ గ్రేటర్ ఎన్నికల టైంలో సమయంలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటిలోని ఒకటి డివిజన్ కు ఒక ఈ– లైబ్రరీ ఏర్పాటు. విద్యార్థులు, నిరుద్యోగులు, సీనియర్​సిటిజన్స్​కు ఉపయోగపడేలా లైబ్రరీ ఏర్పాటు చేసి ఇంటర్​నెట్, కంప్యూటర్లు పెడతామని చెప్పారు. కానీ నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ల్యాప్​టాప్ ఉన్న అభ్యర్థులు డబ్బు కట్టి ప్రైవేట్​స్టడీ హాళ్లకు వెళ్తున్నారు. కట్టలేని నిరుపేద అభ్యర్థులు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్​లైబ్రరీ సమీపంలో ఇండ్లు అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. మంత్రి హామీ ప్రకారం ఈ–లైబ్రరీలను అందుబాటులోకి తెస్తే పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే ఉండి చదువుకోవచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు  పడుతున్నారు. కనీసం ఉన్న లైబ్రరీల్లోనైనా కంప్యూటర్లు పెట్టి, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్​చేస్తున్నారు.

కొత్తవి పెట్టకపోగా ఉన్నవి..

కొత్త లైబ్రరీలు ఏర్పాటు అటు ఉంచి ఉన్న లైబ్రరీలు తగ్గిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో లైబ్రరీలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పదేండ్ల కింద 89 లైబ్రరీలు ఉండగా, ప్రస్తుతం 82 లైబ్రరీలు మాత్రమే ఉన్నాయి. భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, సొంత భవనాలు లేకపోవడంతో 7 లైబ్రరీలను తీసేశారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు కావడం లేదు. కొన్నింటి కోసం భవనాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ పన్నుల్లోంచి లైబ్రరీలకు రావాల్సిన లైబ్రరీ సెస్​11 ఏళ్లుగా ఇవ్వడం లేదు. జనం నుంచి 8 శాతం గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్న బల్దియా అధికారులు కేవలం మెయింటెనెన్స్​కింద రూ.15 లక్షలు చెల్లిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లు సిటీ లైబ్రరీకి బల్దియా బకాయి ఉంది. ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకనే లైబ్రరీల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు.