- జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తితో అభివృద్ధి: కేటీఆర్
- సిరిసిల్లలో పోడు పట్టాల పంపిణీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: కుమ్రం భీమ్ కలలను నిజం చేస్తున్నామని, జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తితో గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల అగ్రికల్చర్ కాలేజీలో బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీలకు తాగు, సాగు నీరందిస్తున్నామని, హరితహారం ద్వారా తెలంగాణలో అడవులను విస్తరించామని చెప్పారు. అనంతరం కుటీర వ్యాపార స్కీమ్ కింద 128 మందికి సిరిసిల్ల కలెక్టరేట్లో ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత పద్మనాయక కల్యాణ మండపంలో 2,858 ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,614 మం దికి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.
పోడు భూముల పట్టాల కోసం ఎంతో కాలంగా గిరిజనులు, ఆదివాసీలు ఎదురుచూస్తున్నారని, వారి చిరకాల కోరికను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్రంలో 1.51 లక్షల మందికి 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. దేశంలో మరెక్కడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు కల్పించలేదన్నారు. 60 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు రైతుబంధు పెట్టుబడి సాయంగా అందించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 2లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతున్నదన్నారు. పోడు రైతులకు కూడా రైతుబంధు, బీమా వర్తిస్తుందన్నారు. ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచామన్నారు.