- కేసీఆర్ మీద ఎవరు పోటీకి వచ్చినా గంప కింద కమ్ముడే
- ఏది ఇస్తే అది తీసుకోండి.. అవన్నీ మన పైసలే
- సిమెంట్, సలాక, పైసలు ఏదిచ్చినా తీసుకోవాలె
- గుజరాత్ నుంచి వస్తున్న పైసలే.. ఓటు మాత్రం కారుకే వెయ్యాలె
- భిక్కనూరు సభలో మంత్రి కేటీఆర్
భిక్కనూరు : ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏది ఇస్తే అది తీసుకోవాలని, సిమెంటు, సలాక, పైసలు ఏవి ఇచ్చినా వదలొద్దని, ఓట్లు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించి భిక్కనూరు, రాజంపేట మండలాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ లీడర్లు పంచుతున్నవి గుజరాత్ పైసలని, అవన్నీ మనవేనని అన్నారు. కేసీఆర్ మీద పోటీకి ఎవరు వచ్చినా గంప కింద కమ్మాలన్నారు. కేసీఆర్ మీద పోటీ అంటే పోచమ్మ గుడి కాడ పొట్టేల్ ను కట్టేసినట్టేనని చెప్పారు.
కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని, కానిస్టేబుల్ కిష్టయ్య, రమేశ్ ఆత్మబలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటైందని అన్నారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, మళ్లీ ఇప్పుడు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతోందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు 2 వందల పింఛన్ ఇవ్వనోడు.. ఇప్పుడొచ్చి నాలుగు వేలు ఇస్తామంటే నమ్ముతమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాట ఇచ్చాడంటే మడమ తిప్పడని, ఆయనకు ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దని అన్నారు. రైతుబంధు పథకం ఇస్తే.. బిచ్చమేస్తున్నవా..? అంటుండు.. అంటే రైతులు బిచ్చగాళ్లా..? ఇట్లా మాట్లాడేటోళ్లకు ఓటేస్తరా..? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ మాత్రమేనని, ఇక్కడి లోకల్ లీడర్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతారని చెప్పారు. కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, సర్పంచ్ తునికి వేణు, సిద్ధరామేశ్వర దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జేపీ సిద్దాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.