- 10 సార్లు గెలిపిస్తే.. కాంగ్రెస్ ఏం చేసింది?
- మనల్ని ఏడిపించిన పార్టీకి మళ్లీ ఓటెయ్యాలా?: కేటీఆర్
- 50 ఏండ్లు పాలించిన రాబందులకు రైతుబంధు ఆలోచన ఎందుకు రాలే?
- సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
- మనకు రామబాణం కేసీఆర్ అని కామెంట్
కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు ఓటు వేస్తే 50 ఏండ్లు పాలించారని, ఏం చేశారని మళ్లీ గెలిపించాలని అడుగుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరెంటు ఇవ్వక, సాగు నీళ్లు ఇవ్వక, ఎరువులు, విత్తనాలు సక్రమంగా ఇవ్వక మనల్ని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఒక సారి రైతులు ఆలోచించాలని కోరారు. మరోవైపు సిలిండర్ ధర పెంచి, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రధాని మోదీకి, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటించారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కామారెడ్డి అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు చేశా రు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా రు. ‘‘50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రాబందులకు రైతుబంధు ఇయ్యాలనే ఆలోచన ఎందుకు రాలేదు? 3 పంటలకు నీళ్లు, 24 గంటల పాటు కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా? 3 గంటల పాటు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా? ప్రజలు ఆలోచించాలి” అని అన్నారు.
సినిమా రీల్ లెక్క రైతులు యాది జేస్కోవాలె
‘‘ఆనాడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, అర్ధరాత్రి వచ్చే కరెంటుతో మన బతుకులు ఆగం జేశారు. కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం ఉండేది. అలాంటి కాంగ్రెస్‌కు ఓటు వేసి మళ్లీ బొక్కబోర్లపడుదామా?కాంగ్రెస్ వస్తే దిక్కు మాలిన దళారీ రాజ్యం, కుంభకోణాల కుంభమేళా చేస్తారు” అని కేటీఆర్ ఆరోపించారు. 50 ఏండ్లు ఏం చేశారని ఇప్పుడు కామారెడ్డిలో షబ్బీర్‌అలీ గడపగడపకు కాంగ్రెస్ అని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వస్తే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రద్దు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను సినిమా రీల్ లెక్క రైతులు యాది జేస్కోవాలని చెప్పారు. ‘‘ఆనాడు సిలిండర్ ధర రూ.400 ఉంటే.. సిలిండర్‌కు మొక్కి ఓటువేయాలని నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పుడు సిలిండర్ రేట్ రూ.1,200 ఉంది. కాంగ్రెస్‌కు పట్టించిన గతినే ఇప్పుడు బీజేపీకి పట్టించాలి. సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి” అని కేటీఆర్ అన్నారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదని, పిరమైన ప్రధాని ఎద్దేవా చేశారు. ‘‘మనకు రామబాణం కేసీఆర్. రైతులకు, ప్రజలకు ఏం చేయాలన్నా నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. ఢిల్లీ గులాములు కావాలా? రాష్ర్ట ప్రయోజనాలు కాపాడే కేసీఆర్ కావాలా? ప్రజలు ఆలోచించాలి” అని సూచించారు.
బీజేపీ వంద అబద్ధాలపై బుక్లెట్, సీడీ
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రూపొందించిన బీజేపీ వంద అబద్ధాలు బుక్ లెట్, సీడీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సోమవారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలా మోసం చేసింది.. తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటోందనే వివరాలు ఈ సీడీలో ఉన్నాయన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, కలగా మారిన ప్రతి ఇంటికి ఇంటర్నెట్, గడువు ముగిసినా అందరికి ఇండ్లు ఇవ్వకపోవడం లాంటి కేంద్ర వైఫల్యాలను ఎండగట్టామని తెలిపారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచేందుకే ఈ క్యాంపెయిన్ చేపట్టామని చెప్పారు.
కేటీఆర్‌కు నిరసన సెగ
కామారెడ్డి, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్తున్న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి వాహనాలకు లింగాపూర్ శివారులో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ లీడర్లు అడ్డుకున్నారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు చేపట్టాలని, కామారెడ్డిని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. లింగంపేటలోనూ మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి.