విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుంది : కేటీఆర్

విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుంది  : కేటీఆర్

విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుందని  మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నష్టాలను జాతికి అంకింతం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని విమర్శించారు.  ప్రభుత్వ రంగ సంస్థలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , వాటిని ప్రైవేటికరణ చేస్తే వచ్చే సమస్యలేంటో సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో BHEL కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.   

విశాఖ స్టీల్ కు, బయ్యారం ఉక్కుకు చాలా వత్యాసం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.  బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే  తెలియదని విమర్శించారు.   కడప, బయ్యారంలో స్టీల్  ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో కేంద్రం  హామీ ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు.  2014 నుంచి తాము బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్రమంత్రులను కలిసిన  లాభం లేదని చెప్పారు. బయ్యారంలో ఇనుము నాణ్యత లేదని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఆదానీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కేటీఆర్ విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే  ఆదానీకి అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న బైలదిల్లా పర్మిషన్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక  ఏప్రిల్ 27న తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ  జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని కేటీఆర్  తెలిపారు