
దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పారని మండిపడ్డారు. నిన్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చాయన్నారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు. దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
విచారణకు హాజరవుతుంది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటామని.. మా ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మార్చి 9వ తేదీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మిగతా మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారాయన. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో కవితకు.. ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ప్రస్తావించారు. మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క కవితకే కాదని.. 10, 12 మంది బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశారన్నారు. మద్యమే లేని గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే ఏ విచారణ చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ పాలసీని తప్పుబడుతున్న వారు.. గుజరాత్ లో జరిగిన ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారాయన. కవిత మొదటిది కాదు.. చివరిది కాదని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు దాడులు చాలా జరుగుతాయన్నారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు కేటీఆర్
మోడీ బినామీ ఎవరని ప్రశ్నిస్తే అదానీ అని చిన్న పిల్లలు కూడా చెబుతారని కేటీఆర్ అన్నారు. ఆదానీపై హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చినా, రూ.13 లక్షల కోట్ల ప్రజల డబ్బులు ఆవిరైనా మోడీ స్పందించడంలేదన్నారు. అదానీ ఒక్కరికే 6 ఎయిర్ పోర్టులు ఇవ్వడం తప్పని నీతి ఆయోగ్, ఫైనాన్స్ మినిస్ట్రీ నివేదిక ఇచ్చినా అదే ఆగలేదని చెప్పారు. గుజరాత్ లో రూ.21 వేల కోట్ల హెరాయిరన్ ముంద్రాపోర్టులో దొరికితే కనీస విచారణ జరగలేదన్నారు.