కాళేశ్వరానికి చిన్న పర్రె పడ్తే బట్టకాల్చి మీదేస్తున్నరు : కేటీఆర్

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ రాజకీ యం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం దగ్గర రెండు స్లాబులు కలిసే ఎక్స్​ప్యాన్షన్ జాయింట్ దగ్గర చిన్న పర్రె పడితే ప్రాజెక్టు మొత్తం పోయిందని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బద్నాం చేస్తున్నరు.  బట్టకాల్చి కేసీఆర్​మీదేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు  పగుళ్లను రాహుల్ గాంధీ ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నరు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఓ నాలుగైదు సీట్లు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతున్నది” అని ఫైర్ అయ్యారు.

 సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన యువ ఆత్మీయ  సమ్మేళనాల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ‘‘సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నరు. యావత్ తెలంగాణ యుద్ధం చేస్తే తెలంగాణ వచ్చింది. ఎంతో మంది పిల్లల చావుల తర్వాత, ఎన్నో ఉప ఎన్నికల తర్వాత, ఎంతో మంది జైలుకు వెళ్లిన తర్వాత.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అయితదని భావించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది’’  అని అన్నారు.   

డీకే వచ్చి పీకేదేమీలేదు.. 

కర్నాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. ‘‘ఈ మధ్య కర్నాటక నుంచి డీకే వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నడు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించిండు. రేవంత్ రెడ్డేమో 3గంటలు కరెంట్ ఇస్తామంటున్నడు. వారి ప్రకటనలు విని తెలంగాణ ప్రజలు ఆలోచనలో పడుతున్నరు. డీకే వచ్చి ఇక్కడ పీకేదేమీలేదు” అని కామెంట్ చేశారు.

 ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, అంజుమాన్ బ్యాంకోడు తలుపులు, కిటికీలు గుంజుకుపోవుడు ఉంటుండే. అవన్నీ యాదికి తెచ్చుకోవాలి. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? 5 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి” అని అన్నారు. పార్టీలో కొంతమంది అలుగుతున్నారని.. అలిగినా గులిగినా వాళ్లు తమ వాళ్లేనని, తమతోనే ఉంటారని చెప్పారు. 

చల్మెడను గెలిపించకపోతే వేములవాడకు రాను..  

‘‘కేసీఆర్ ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి గుంపులుగా వస్తున్నరు. సింహం సింగిల్ గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తయ్. ఆదివారం కోహ్లీ సెంచరీ కొట్టినట్టు.. ఈ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తం” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను సిరిసిల్ల ప్రజలు గర్వపడేలా పని చేశానని, ఈసారి కూడా తనను లక్షకు పైగా మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.

 వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మినర్సింహారావును గెలిపించాలని, ఆయనను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. చల్మెడను గెలిపించకపోతే మళ్లీ వేములవాడకు రానని, తన కోసం చల్మెడను గెలిపించాలని కోరారు. కాగా, అంతకుముందు సిరిసిల్లలో వైఎస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము 200 మందితో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు.