మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటా: మంత్రి కేటీఆర్

ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయ‌లేదు.. పైస‌లు పంచ‌డం అలవాటు లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మందు పోయించ‌ను.. పైస‌లు పంచ‌ను. మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటాను అని మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు.

రాజ‌న్న సిరిసిల్ల క‌లెక్టరేట్‌ నిర్వహించిన బీసీ బంధు ప‌థ‌కం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కులవృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అందరి కంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నామని, అంతే కాకుండా 14 వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఈ పథకం కింద 10 వేల దరఖాస్తులొచ్చాయి.. ఇవాళ తొలివిడతలో 600 మందికి ఇస్తున్నామని ఆయన  వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో మరికొందరికి ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడ లేని విధంగా 12లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింద నిధులిచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. పథకాల కింద వచ్చే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, సెప్టెంబర్ లో సిరిసిల్లలో మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మహబూబాద్‌ వెళ్ళినప్పుడు అక్కడి మెడికల్ కాలేజీ లో తెలుసుకుంటే 140 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని, రైతు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలు పెట్టామన్నారు మంత్రి కేటీఆర్‌.