సిటీని కేటీఆర్ ఆగం చేసిండు: ఇంద్రసేనారెడ్డి

సిటీని కేటీఆర్ ఆగం చేసిండు:  ఇంద్రసేనారెడ్డి

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి


ఎల్​బీనగర్, వెలుగు: హైదరాబాద్​ను డల్లాస్​గా తీర్చిదిద్దుతామని నగరవాసులను ఊరించి ఎస్ఎన్ డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్​ మెంట్ ప్రోగ్రామ్ ) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడమే తప్ప వరద సమస్యను పరిష్కరించలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎల్​బీనగర్ పరిధిలోని నాగోల్, గడ్డి అన్నారం డివిజన్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన పర్యటించి మాట్లాడారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్​గా హైదరాబాద్​ను ఆగం చేసి మోసగిస్తున్నారని విమర్శించారు. 2015లో గ్రేటర్ ఎన్నికల ముందు సిటీలో గుంతలు కనిపిస్తే.. గుంతకు వెయ్యి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు.

ప్రతిఏటా గుంతలు పడుతూనే ఉన్నాయని, పనులు చేస్తున్నామని, నిధులు శాంక్షన్ చేశామని  చెప్పుకుంటూ చేయడం లేదని.. డబ్బులు వాళ్ల జేబుల్లోకి మాత్రం వెళ్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న ప్పుడు సరూర్ నగర్ చెరువు కింద అలుగు నుంచి వరద  వచ్చేందుకు కెనాల్ ఏర్పాటు చేశామని, దాన్ని ధ్వంసం చేశారని మండి పడ్డారు. అనాలోచన నిర్ణయంతో బాక్స్ డ్రైయిన్లు నిర్మించారని, ఇప్పుడు ఎటూ కాకుండా మధ్యలో చేతులెత్తేశారని విమర్శించారు. ఆయన వెంట కార్పొరేటర్లు చింతల అరుణ, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నేతలు చింతల సురేందర్ ఉన్నారు.