మున్సిపాలిటీల్లో స్లోగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల పనులు

మందమర్రి,వెలుగు: ప్రతీ మున్సిపాలిటీలో ఆరునెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ​హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్థల వివాదాలతో ఆలస్యంగా ప్రారంభమైన పనులు పునాది దశ దాటలేదు. దీంతో వ్యాపారులు రోడ్లమీద, చెట్లకింద కూరగాయాలు అమ్ముతున్నారు. వానకు తడుస్తూ ..ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నారు. 

పనులన్నీ పిల్లర్ల దశలోనే...

మంచిర్యాల జిల్లాలో ఒకచోట కూడా ఇంటిగ్రేటెడ్​మార్కెట్​పనులు పునాదిదశ దాటలేదు. జిల్లా కేంద్రంలోని ఐబీ ఆవరణలో, రామకృష్ణాపూర్​(క్యాతనపల్లి) మున్సిపాలిటీలోని అంబేద్కర్​ వారాంతపు సంత ఎదురుగా, మందమర్రి మున్సిపాలిటీలోని రామన్​కాలనీ ఎదుట, నస్పూర్​ మున్సిపాలిటీలోని సుందరయ్యకాలనీ వద్ద వారసంత స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మిస్తున్నారు. ఒక్కోదానికి రూ.7.2 కోట్లు కేటాయించారు. చెన్నూరులోని పాత తహసీల్దార్​భవనం స్థలంలో రూ.7.5 కోట్లు,  లక్సెట్టిపేట పాత పోలీస్ స్టేషన్ వెనుక రూ.3.90 కోట్లతో మార్కెట్​పనులు చేపట్టారు. బెల్లంపల్లిలోని కాంటా వద్ద రూ.2 కోట్ల ఫండ్స్​తో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. చెన్నూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని మార్కెట్ల పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. మిగిలిన చోట్ల మార్కెట్ నిర్మా ణపనులన్నీ పిల్లర్లకే పరిమితమయ్యాయి. 

రోడ్ల మీద.. చెట్లకింద వ్యాపారాలు

పట్టణాల్లో కూరగాయలు, చికెన్, మటన్​వ్యాపారాలన్నీ రోడ్లపైనే సాగుతున్నాయి. దీంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తైబజార్లు, సంతల వేలంలో రూ. లక్షల్లో ఆదాయం వస్తున్నా ప్రస్తుత మార్కెట్లలో కనీసం సౌలత్​లు కల్పించడంలో మున్సిపల్​శాఖ, సంతల నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. టాయిలెట్, టాయిటెట్స్​ ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని మొయిన్​ మార్కెట్​రద్దీగా మారడంతో మున్సిపల్ ఆఫీస్ పక్కన, లక్ష్మిటాకీస్, ఐబీ చౌరస్తా, ఇతర ప్రధాన కూడళ్ల రోడ్లపైనే వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. మందమర్రిలో ప్రస్తుతం మార్కెట్ లోని షెడ్లలో ​, పాలచెట్టు ఏరియా,  పాతబస్టాండ్​ ఏరియా నేషనల్ హైవే రోడ్లపై కూరగాయలు అమ్ముతున్నారు. చెన్నూరులోని జగన్నాథాలయం ఆవరణ, గాంధీచౌక్, రాజీవ్ రోడ్డు, పాత, కొత్త బస్టాండ్​ప్రాంతాల్లో రోడ్లు పక్కనే వ్యాపారం చేస్తున్నారు. లక్సెట్టిపేటలో ప్రధాన రోడ్డుపైన, పాత బస్టాండ్, ఊట్కూర్​ చౌరస్తాలో కూరగాయలు అమ్ముతున్నారు. నస్పూర్, బెల్లంపల్లిలో ఇదే పరిస్థితి.