గోదావరిఖని, వెలుగు : వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగిన దశాబ్ధి ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు కౌశిక హరి, బీజేపీ కార్పొరేటర్ కౌశిక లత, కాంగ్రెస్ కార్పొరేటర్ గాదం విజయ, నందు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేశ్, తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం అంతర్గాంలో రూ.60 కోట్లతో ఇండస్ట్రీయల్ పార్క్, గోదావరిఖనిలో రూ.30 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం, రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. గృహలక్ష్మి, జీవో నెంబర్ 76, 58, 59 కింద ఇండ్ల పట్టాల పంపిణీ, ఆసరా పింఛన్ల ప్రోసీడింగ్స్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ నాగేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల నిరసన
గోదావరిఖనిలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. కాన్వాయ్ వెళ్తుండగా స్థానిక మార్కండేయకాలనీ రాజేశ్ థియేటర్ మూలమలుపు వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు సులోచన, చంద్రకళ, స్వరూప, రుక్మిణీ, కృష్ణ కుమారి, తిరుమల, లావణ్య, సుమ పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ప్రతిపక్ష లీడర్లు...
మంత్రి కేటీఆర్ పర్యటనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన లీడర్లను పోలీసులు తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకున్నారు. వివిధ పార్టీలు, కార్మిక సంఘాలకు చెందిన రియాజ్ అహ్మద్, ఐ.కృష్ణ, ఇ.నరేశ్, కొంటు సాగర్, కేతావత్ కృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తరలించి మంత్రి పర్యటన ముగిశాక విడిచిపెట్టారు. కాగా యైటింక్లయిన్ కాలనీలోని గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో లీడర్ల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.