ఆమె ఎమ్మెస్సీ చదివింది. ఫస్ట్ క్లాస్ లో పాసైంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా(స్వీపర్) పనిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఆమెకు ఉద్యోగం కల్పించి చేయూత నిచ్చారు. రజని స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఎంతో కష్టపడి చదువుకుంది. 2013లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత పీహెచ్ డీ చేసేందుకు అవకాశం వచ్చినా, ఇంతలో పెళ్లి కావడంతో భర్తతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజని భర్త న్యాయవాది. అయితే అతను హృద్రోగానికి గురికావడంతో మూడుసార్లు స్టెంట్లు వేశారు. దాంతో న్యాయవాద వృత్తికి దూరమయ్యాడు. కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఉద్యోగం దొరక్కపోవడంతో సంతల్లో కూరగాయలు కూడా అమ్మిన రజని… చివరికి రూ.10 వేల జీతానికి జీహెచ్ఎంసీలో రోజువారి పారిశుద్ధ్య కార్మికురాలిగా విధుల్లో చేరింది. ఆమె దయనీయ గాథ అధికారుల ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించారు. రజనిని తన కార్యాలయానికి ఆహ్వానించారు. ఆమె ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిందని తెలుసుకుని, ఆమె విద్యార్హతలకు తగిన విధంగా జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. కేటీఆర్ స్పందన పట్ల రజని తీవ్ర భావోద్వేగాలకు లోనైంది. ఆనందంతో కంటతడి పెట్టింది. మంత్రి కేటీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మంత్రి కేటీఆర్ తనను ఓదార్చి.. తనకు మంచి భవిష్యత్తు ఉందని.. చదువు ఎప్పుడూ తలవంచుకునేలా చేయదని రజనికి ధైర్యం చెప్పారు.
Best moment of my hectic day today ?
— KTR (@KTRTRS) September 20, 2021
All the very best Rajni Garu in your new role ? https://t.co/xHWqetXHeT