- ఆ రెండు పార్టీలు దొందూ దొందే
- కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలి
- ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్
కూకట్ పల్లి, వెలుగు : ఎన్నికలు రాగానే ఓట్లు దండుకోవాలని దొంగ జపం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దశాబ్దాల పాటు పాలించి తెలంగాణను వంచించిన పార్టీ ఒకటైతే.. పదేండ్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా సాయం చేయని కేంద్రంలోని బీజేపీ మరొకటని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తున్న ఆ పార్టీల నాయకులు.. ఓట్ల కోసం వస్తే జనాలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కూకట్పల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 45 రోజుల పాటు చేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం కేపీహెబ్బీ కాలనీలో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశారు.
చీఫ్‌గెస్టుగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. భారీ ఆధిక్యంతో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తోందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాధవరం కృష్ణారావును కూకట్ పల్లి నుంచి మరోసారి గెలిపించటానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..
మంత్రి కేటీఆర్ సహకారం వల్లే కూకట్‌పల్లిలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఏండ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం సెగ్మెంట్లోని మెయిన్ ఏరియాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చెరువులను బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించామని కృష్ణారావు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, సబీహా గౌసుద్దీన్, ముద్దం నర్సింహయాదవ్, రవీందర్‌రెడ్డి, పండాల సతీష్‌గౌడ్, శిరీష, కూకట్పల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా పాల్గొన్నారు.