గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్ల మారాలి : మంత్రి కేటీఆర్

  • ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి  కేటీఆర్

రాజన్నసిరిసిల్ల,వెలుగు : గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్ల తయారుకావాలని, అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు టీమ్ వర్క్ గా పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో గృహలక్ష్మి పథకంపై ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీలో సర్వే చేస్తే 2,800 మంది ఇండ్లు లేని పేదలు ఉన్నట్లు తేలిందన్నారు. వారిలో ఇప్పటికే 2 వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. గృహలక్ష్మి పథకంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న, శిథిలావస్థలో ఇండ్లున్న వారికి ఇంపార్టెన్స్​ఇవ్వాలన్నారు. 

బీవై నగర్, సుందరయ్య నగర్, పద్మనగర్ లలో పొజిషన్ లో ఉన్న 4, 200 మందికి రిజిస్ట్రేషన్​అయి బ్యాంక్ లోన్లు వచ్చేలా  ఈ నెల 15న పట్టాలు అందజేస్తామని చెప్పారు. సిరిసిల్ల కు వరద ముంపు లేకుండా శాశ్వత చర్యలు చేపడతామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.  సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్స్​డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్​గూడూరి ప్రవీణ్, టెస్కాబ్​చైర్మన్​ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళ, మాధవి , కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్​ కలెకర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.