ఐటీ హబ్ ఉన్నట్టా? లేనట్టా? .. సూర్యాపేట పాత కలెక్టరేట్​లో ఏర్పాటు

  • వివాదాస్పదం కావడంతో అక్కడి నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ కు తరలింపు
  • 350 మందిని ఎంపిక చేసి 70 మందినే  తీసుకున్నారు
  • సిబ్బందికి పని లేదు.. జీతం లేదు , ఆందోళనలో ఉద్యోగులు 
  • పత్తా లేని 32 కంపెనీలు
  • మాజీ మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ముందు ప్రారంభించిన ఐటీ హబ్  మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను మూడు నెలల్లోనే మున్సిపల్   కాంప్లెక్స్ కు తరలించడం, అక్కడ ఒక్క గదినే కేటాయించడం, మొదట 350 మందిని ఎంపిక చేసి 70 మందికే నియామక పత్రాలు అందిండం వంటి కారణాలతో అసలు ఇక్కడ ఐటీ హబ్  ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ‌ఆర్ సూర్యాపేటలో ఎన్నికలకు 45 రోజుల ముందు ఐటీ హబ్ ను పాత కలెక్టరేట్ లో  ప్రారంభించారు. అప్పటికే అక్కడ ఈవీఎంలు ఉండడంతో పెద్ద దుమారం రేగింది. దీంతో ఐటీ హబ్ ను పాత కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ లోకి  మార్చారు. అప్పటి నుంచి ఆ ఐటీ హబ్ ను ఓపెన్ చేయలేదు. ఎన్నికల ముందు హడావుడిగా 32 కంపెనీలతో ప్రారంభం కాగా నేడు ఆ కంపెనీలు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. దీంతో నాడు ఐటీ హబ్ లో ఉద్యోగం పొందిన ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు.

స్థానికులకు ఐటీ ఉద్యోగాల పేరుతో 

గతంలో సూర్యాపేటలో ఐటీ హబ్  నెలకొల్పుతామని నాటీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ‌ఆర్ అమెరికాలో ప్రకటించారు. స్థానికులకు కొలువులు అందించాలన్న లక్ష్యంతో ఎన్నికలకు 45 రోజుల ముందు సూర్యాపేట పాత కలెక్టరేట్ లో ఐటీ హబ్  ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్  రెడ్డి ప్రకటించారు. ఇందుకు విదేశాలలో ఉన్న 32 సాఫ్ట్ వేర్ కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన చెప్పారు. 

మొదట  సూర్యాపేట ఐటీ హబ్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు 18 మంది ఎన్నారైలు ముందుకు రాగా, ప్రస్తుతం 15 కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు సైతం పాత కలెక్టరేట్ లో రెండు అంతస్తుల్లో హబ్  కోసం ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అన్ని చాంబర్లు సిద్ధం చేయగా  కంపెనీల కార్యకలాపాలకు కాన్ఫరెన్స్‌ హాల్స్‌, సెంట్రల్‌ ఏసీ, విశాలమైన గదులను అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేశారు. సెప్టెంబర్ లో జాబ్ మేళా నిర్వహించారు. 

ఆ మేళాకు 4,212 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 350 మందిని ఎంపిక చేశారు. ముందుగా 70 మందికి కేటీ‌ఆర్  చేతుల మీదుగా ఆర్డర్స్  అందజేశారు. ఎన్నికల అనంతరం 600 మందిని నియమిస్తామని, షిఫ్ట్ కు 300 మంది చొప్పున రెండు షిఫ్టులలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించిన కంపెనీలు పత్తా లేకుండా పోయాయి. ఉన్న సిబ్బందికి కూడా సరిగా జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్నికల్లో లబ్ధి కోసమేనా?

పాత కలెక్టరేట్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేయడంతో రాజకీయ దుమారం నెలకొంది. ఆ కలెక్టరేట్ లో అప్పటికే ఈవీ‌ఎంల కోసం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతో ఈ‌వీ‌ఎంలను ట్యాంపరింగ్  చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆ ఐటీ హబ్ ను అక్కడి నుంచి తాత్కాలికంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లోకి మారుస్తూ కలెక్టర్  ఆదేశాలు జారీ చేశారు. 

కేవలం ఒక్క గదిలో ఐటీ హబ్ ను కేటాయించారు. అంతేకాకుండా మొదట తీసుకున్న ఉద్యోగులకు ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేస్తుండడంతో ఐటీ హబ్ నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాఫ్ట్ వేర్  ఉద్యోగం అంటూ తీసుకున్న కంపెనీలు ప్రస్తుతం తమతో టెలికాలర్  ఉద్యోగాలు చేయిస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల లబ్ధి కోసమే ఐటీ హబ్  పేరిట హడావుడిగా నెలకొల్పారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఐటీ హబ్  కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్  మాజీ ఎమ్మెల్యేది కావడంతో అద్దె కోసమే అక్కడ ఏర్పాటు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.