
గండిపేట/శంషాబాద్, వెలుగు : గండిపేటలోని రిజర్వాయర్ వద్ద 18 ఎకరాల్లో రూ.35.60 కోట్లతో అభివృద్ధి చేసిన పార్కును మంత్రి కేటీఆర్మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గండిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్కూల్ డేస్లో ఇక్కడికి పిక్నిక్ కు వచ్చే వాళ్లమని చెప్పారు. కుటుంబంతో వెళ్లి గడిపే పెద్ద పార్కులు సిటీలో లేవని, అందుకే గండిపేట వద్ద అభివృద్ధి చేశామని చెప్పారు. పక్కనే ఉన్న 70 ఎకరాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే కాటేజీలు నిర్మిస్తామన్నారు. గండిపేట చెరువు చుట్టూ 46 కి.మీ ఇంటర్నేషనల్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం తన కల అన్నారు. ఫిరంగి, బుల్కాపూర్ నాలాలపై కబ్జాల తొలగింపును స్థానిక నాయకులు అడ్డుకోవద్దని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్ మండలం కొత్వాల్ గూడలో ఓఆర్ఆర్కు ఇరువైపులా 100 ఎకరాల్లో రూ.300 కోట్లతో నిర్మించనున్న ఎకో పార్కు పనులకు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ పార్కులో అతిపెద్ద అక్వేరియం, బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, ఆర్డీవో చంద్రకళ పాల్గొన్నారు.