హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ, విదేశాల నుంచి ఉపాధి కోసం నగరానికి వస్తున్నారని చెప్పారు. గండిపేట చెరువు వద్ద ఏర్పాటు చేసిన పార్క్ను ఆయన ప్రారంభించారు. గండిపేట్ పార్క్తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. స్కూల్లో ఉన్నప్పుడు అక్కడికి పిక్నిక్కు వచ్చే వాళ్ళమని తెలిపారు. గండిపేట చెరువు చుట్టూ 46 కిలోమీటర్ల అంతర్జాతీయ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనేది తన కల అని కేటీఆర్ తెలిపారు.
ఫిరంగి నాల, బుల్కాపుర్ నాలాలపై కబ్జాలు ఉంటే తొలగించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గోదావరి, కృష్ణ జలాలను నగరానికి అందిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. కొత్వాల్గూడలో దేశంలోనే అతి పెద్దదైన ఎక్వైరియంను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరగాలన్నారు.