బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని పరిష్కరించాల్సివుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్జీయూకేటీని ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారితో కలిసి భోజనం చేశారు. మెస్లో బాత్రూం సహా ట్యాప్ సరిగ్గా లేదన్నారు. కొత్త మెస్సే ఇలా ఉంటే.. పాత మెస్ ఎలా ఉంటుందోనని వ్యాఖ్యానించారు. కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. నవంబర్ లో విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు అందజేస్తామన్నారు.
కాలేజీ సమస్య తీవ్రతను గుర్తించి అధికారులను నియమించామని..అతి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కేటీఆర్ తెలిపారు. ఒక సంస్థను ఏర్పాటుచేయడం కన్నా దానిని మెయింటనెన్స్ చేయడం కష్టమన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్ గా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కేటీఆర్ చెప్పారు. పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇన్నోవేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లకే అర్ధం అవుతుందని అనుకోవొద్దని చెప్పారు.
యూనివర్సిటీలో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులు ఐక్యంగా శాంతియుతంగా పోరాడడం తనకు నచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ఇవాళ తాను వచ్చానని మంచి భోజనం పెట్టారని..నవంబర్ లో మళ్లీ యూనివర్సిటీని సందర్శిస్తామని చెప్పారు. యూనివర్సిటీ పరిశుభ్రంగా ఉండేందుకు విద్యార్థులు కూడా సహకరించాలని మంత్రి సూచించారు.