రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. యువతిని కిడ్నాప్ చేసిన నిందితులను సాయంత్రంలోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉపేక్షించొద్దని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మూడపల్లిలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతి కిడ్నాపైన విషయం తెలిసిందే. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని కిడ్నాప్ చేశారు. యువతి వచ్చే దారిలో అప్పటికే కారులో కాపు కాసి ఉన్న నలుగురు యువకులు... ఆమె తండ్రిని కొట్టి బలవంతంగా కారులో లాక్కెళ్లారు. ఈ కిడ్నాప్ ఘటనపై అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి విచారణను కొనసాగిస్తున్నారు.