హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర టెక్నాలజీలతో సామాజిక సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ ఐఐఐటీ డెవెలప్ చేసిన మూడు ఏఐ ప్రాజెక్టులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వీటిలో ఐరాస్తే తెలంగాణ, బోధ్యాన్ కార్ ప్లాట్‌ఫాం, మైక్రోల్యాబ్ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యులకు చేరువయ్యేందుకు, గ్రౌండ్ లెవెల్‌లో సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటోందని అన్నారు. బిజినెస్ లీడర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారిందని అన్నారు. ఏఐని ఉపయోగించడం వల్ల 2035 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 957 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా రాష్ట్రం ఇప్పటివరకు 25 వేల మందికి పైగా విద్యార్థులు 4,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చిందని, ఇది ఇప్పుడు ఫౌండేషన్ ఏఐ కోర్సులలో హైస్కూల్ స్థాయిలో సుమారు లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ చెప్పారు. ఐఐఐటీలోని అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ (ఐఎన్ఏఐ)లో మొదలైన ఈ మూడు ప్రాజెక్ట్‌లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది జీవితాలను రక్షించగలుగుతాయని, ఐఐఐటీ-హెచ్ సెంటర్ ఫర్ క్వాంటమ్ సైన్స్ అండ్ కంప్యూటింగ్‌కు తెలంగాణ సపోర్ట్ చేస్తుందన్నారు.
తగ్గనున్న యాక్సిడెంట్లు...
ప్రాజెక్ట్ ఐరాస్తే ఏఐని, అధునాతన డ్రైవర్- అసిస్టెన్స్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. దీనివల్ల రోడ్డు భద్రత మరింత పెరుగుతుంది. ప్రాజెక్టులో ఐఎన్ఏఐ, ఐఐఐటీహెచ్, ఇంటెల్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ), ఉబర్ పాలుపంచుకుంటున్నాయి. ప్రమాదాలను నివారించడానికి ఏఐ ద్వారా రూపొందించిన ప్రిడిక్టివ్ ఇన్సైట్లను ఉపయోగిస్తారు. బోధ్యాన్ అనేది కార్ డేటా క్యాప్చర్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా సెన్సర్లు, కెమెరాలు, లైడర్లు, నైట్-విజన్ కెమెరాలు, రాడార్లు కారు రియల్‌టైం డేటాను సేకరిస్తాయి. వెహికల్ నావిగేషన్, డేటా సేకరణ లేదా రోడ్ల పరిశోధనలకు సంబంధించిన ఏదైనా అల్గారిథమ్‌లు లేదా పద్ధతులను పరీక్షించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించొచ్చు.