రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రకాల సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై చ‌ర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు, పోడు భూముల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 6886 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. --పేదవాళ్లలో అత్యంత నిరుపేదలకు, పక్షపాతం లేకుండా ఇండ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. 

595 పాఠశాలలకు గాను 172 పాఠశాలలను మొదటి విడతలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో తీసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వీటిని సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 200 సంఖ్య నుండి 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో -- విద్యా ప్రమాణాలను మరింత పెంచుతున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ సంక్షేమ రంగాలపై వచ్చే ఏడాది మార్చి వరకూ కొత్త నివేదిక రూపొందించి ప్రజలకు తెలియజేస్తామన్నారు. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ ఇల్లు లేని వారు ఉండకూడదన్నారు. ఇల్లు కట్టడం,పెండ్లి చేయడం కష్టమైన రెండు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందన్నారు. 

అంతకు ముందు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కలిసి కానిస్టేబుల్ కిష్టయ్య సంస్కరణ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.